రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు జూన్ 20న విడుదల కానున్నాయి. పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. 23 వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున జమ చేయనున్నారు. పిఎం కిసాన్ పథకాన్ని 2019లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ. 2 వేలు చొప్పున మొత్తంగా రూ. 6 వేలను రైతుల ఖాతాల్లో వేస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 13న 22 వ విడత నగదును అస్సోం లోని గౌహతి వేదికగా ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. పిఎం కిసాన్ నిధులు పొందే వారి జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం పిఎం కిసాన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి అందులో ఫార్మర్ కార్నర్ సెక్షన్ లోకి వెళ్లాలి. అందులో లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇకేవైసీ చేయని వారికి నిధులు జమ కావు. కాబట్టి అదే పోర్టల్‌లో ఇకేవైసీ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.