జగిత్యాల: కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అర్వింద్‌ తీరు మారడం లేదని, కావాలనే రాజ కీయం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జగిత్యాలలో మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయింపునకు కలెక్టర్‌ సర్వే చేయించి డిప్యూటీ కమిషనర్‌ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు 10రోజుల క్రితం పంపించారన్నారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి పాత ఎస్పీ కార్యాలయాన్ని కేటాయించి, కొన్ని కొన్ని మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సైతం విశేష కృషి చేస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్‌ ఇప్పటికై నా కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు నాగభూషణం, జ్యోతి, లక్ష్మణ్‌, బండ శంకర్‌, సతీశ్‌, మన్సూర్‌, చాంద్‌పాషా, కొత్త మోహన్‌, అబ్దుల్‌ ఖాదర్‌, బాలముకుందం పాల్గొన్నారు.

జగిత్యాలటౌన్‌: జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌కు దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకుని, ధైర్యంగా ప్రజల్లో తిరగాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి సవాల్‌ విసిరారు. బుధవారం జగిత్యాలలో మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి చైర్మన్‌, కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. యావర్‌రోడ్డు విస్తరణకు గతంలోనే వంద ఫీట్లకు మ్యాపింగ్‌తో పాటు గెజిట్‌ పాస్‌ అయిన విషయాన్ని గుర్తు చేశారు. యావర్‌రోడ్డు మెజర్మెంట్‌ ఎప్పుడో అయిపోయి సంబంధిత ఏజెన్సీకి చెల్లింపులు జరిగాయని గుర్తు చేశారు. రాయికల్‌ మండలంలో జరిగిన అధికా రిక కార్యక్రమానికి ఎంపీ హాజరవగా, కనీస మర్యాద పాటించకుండా పెయిడ్‌ బ్యాచ్‌తో రెచ్చగొట్టే ధోరణిలో నినాదాలు చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వేముల శ్రీనివాస్‌, పార్టీ కోశాధికారి సుంకెట దశరథరెడ్డి, ఆముద రాజు, సిరిపురపు శ్రీనివాస్‌, గట్టెపెల్లి జ్ఞానేశ్వర్‌, మమత, రమేశ్‌, సాయికుమార్‌ పాల్గొన్నారు.

కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో సాగునీటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీ రమేశ్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఇరిగేషన్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. మెట్‌పల్లిలో కోర్టు భవనానికి ఇరిగేషన్‌శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కేటాయించాలని, కోరుట్ల నియెజకవర్గంలో చెరువులు, కుంటల మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం గంగనాల ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుకు రూ.1.23 కోట్లు మంజూరు చేయాలన్నారు. మల్లాపూర్‌ మండలం రేగుంట మాటు కాలువ పునరుద్ధరణ, నియోజకవర్గంలో దెబ్బతిన్న కాకతీయ ప్రధాన కాలువ, ఉపకాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

జగిత్యాలక్రైం: ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్‌ చేస్తామని ఎంవీఐ రామారావు అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, బైపాస్‌రోడ్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతీ వాహనానికి ఫిట్‌నెస్‌తో పాటు, ఇన్సూరెన్స్‌ ఉండాలని, ప్రతి డ్రైవర్‌కు లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులు ఉండాలన్నారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న రెండు ఆటోలను సీజ్‌ చేయడంతో పాటు, అనుమతులు లేని రెండు పాఠశాల వాహనాలను సీజ్‌ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోకు తరలించినట్లు తెలిపారు. అసిస్టెంట్‌ ఎంవీఐలు సాయిచరణ్‌, రియాజ్‌ పాల్గొన్నారు.