KTR : ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యూహాలను వివరించారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) , పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా ముందు తన సొంత బూత్‌లో మెజారిటీని నిరూపించుకోవాలని, అప్పుడే పార్టీ గెలుపు సులువవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాలపరిమితిని గుర్తుచేస్తూ.. ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు , అభ్యంతరాలను స్వీకరించే సమయం ఉందని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయి, అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ ఫైనల్ లిస్ట్ రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని, కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ప్రతి బూత్‌లోనూ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) తో కలిసి ఓటరు జాబితాను నిరంతరం సరిచూసుకోవాలని ఆదేశించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ప్రాంతాల్లో ఓట్లు ఉండే అవకాశం ఉందని, ఉదాహరణకు లావణ్య అనే వ్యక్తికి ఐదు చోట్ల ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఉదహరించారు. ఇలాంటి అనుమానాస్పద, డూప్లికేట్ ఓట్ల జాబితాను ప్రత్యేకంగా తయారు చేసి పార్టీ నాయకులకు అందజేయాలన్నారు. కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ తరపున ‘హ్యాండ్ బుక్’, ‘వర్క్ బుక్’ అందజేస్తామని, వీటి సహాయంతో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు , కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమై పనిచేస్తేనే ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.