జిల్లాకేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తం డ్రైనేజీల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి చేరుతున్న మురుగు దుర్గంధంతో స్థానికుల ఇబ్బందులు చర్యలు చేపట్టని అధికారులు

జగిత్యాల: జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. డ్రైనేజీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. రోజూ కాకున్నా వారానికోసారి పూడిక తీసినా డ్రైనేజీలు శుభ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టవర్‌సర్కిల్‌, తహసీల్‌ చౌరస్తా, ప్రధాన కూడళ్లలో మురుగుకాల్వలపై కప్పులు ఉండటంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. తినుబండారాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. వ్యర్థాలు పేరుకుపోవడంతో అక్కడక్కడా పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చిన్నపాటి వానలకే మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. అధికారులు స్పందించి డ్రైయినేజీలపై పూర్తిస్థాయిలో కప్పులు వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, రోజూ సిల్ట్‌ తీసేలా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

జగిత్యాలలో శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్తాచెదారం పడేస్తుండడంతో ఈగలు, దోమలు పెరిగి స్థానికులు వ్యాధుల బారిన పడే అవకాశముంది. ఇప్పటికై నా అధికారులు శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

‘ఇది బైపాస్‌రోడ్‌లోని సాయిబాబా ఆలయం ముందు గల డ్రైనేజీ. వర్షకాలం పూర్తిగా నిండిపోతుంది. ఇక్కడ చౌరస్తా ఉండడంతో చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్డుపై వరద పొంగిపొర్లుతోంది. స్థానిక కాలనీవాసులకు విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు బాగు చేపిస్తామంటారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి మురికినీరు సాఫీగా వెళ్లేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు’.