గతేడాదితో పోల్చితే 9.69 శాతం పెరిగిన కేటాయింపులు

ఆసిఫాబాద్‌: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో 2026– 27 సంవత్సరానికి రూ.3,546.79 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ కె.హరిత నిర్ణయించారు. జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు మొత్తం 56 ఉన్నాయి. వీటిలో 39 గ్రామీణ ప్రాంతా లు, 17 సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో బ్రాంచీల ద్వారా రుణాలు అందిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,233.47 కోట్ల రుణ లక్ష్యం కాగా, వీటిలో రూ.1,680.67కోట్ల పంట రుణాలు, రూ.359.63 కోట్ల వ్యవసాయ టర్మ్‌, ఇతర రుణాలు కేటాయించినా బ్యాంకర్లు పంపిణీ లక్ష్యాన్ని చేరలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు నిబంధనలతో రుణాల పంపిణీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడం, బ్యాంకర్లు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో లక్ష్యాన్ని చేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2025– 26 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఈసారి రుణ ప్రణాళికలో 9.69 శాతం అదనంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.3,233.47 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,546.79కోట్లు కేటాయించారు. గతేడాది 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.232.43 కోట్లు అందజేయాల్సి ఉండగా, 2,609 సంఘాలకు 157.94 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి 8,163 స్వయం సహాయక సంఘాలకు రూ.239.77 కోట్లు చెల్లించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ14.69 కోట్లు(2.68 శాతం) అందజేశారు. బ్యాంకర్ల పనితీరుపై కలెక్టర్‌ కె.హరిత సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశా రు. పీఎం ముద్ర లోన్‌ కింద 9,833 మందికి రూ.87.49 కోట్లు అందజేశారు. వీటిలో రూ. 50 వేల లోపు రుణాలు 5,353 మందికి రూ.11.73 కోట్లు, రూ.5 లక్షల లోపు రుణాలు 3,910 మందికి రూ.34.64 కోట్లు, రూ.10 లక్షల లోపు రుణాలు 461 మందికి రూ.27.67 కోట్లు, రూ.20 లక్షల లోపు రుణాలు 109 మందికి రూ.13.45 కోట్లు అందించారు. సెక్టా ర్‌ టార్గెట్‌ అచీవ్‌మెంట్‌ కింద ఎడ్యుకేషన్‌ రుణాలు 38.4 కోట్లు లక్ష్యం కాగా, కేవలం రూ.1.6 కోట్లు(4.1 శాతం) మాత్రమే అందజేశారు. హౌజింగ్‌ రు ణాలు రూ.78 కోట్లు లక్ష్యం కాగా, కేవలం 8.5 కో ట్లు(10.9 శాతం) అందజేయడం గమనార్హం. రైతులతోపాటు మహిళా సంఘాలు, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఆశించిన పురోగతి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరము న్న రుణాలు ఇస్తేనే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. పాత వారికి తిరిగి కొత్త రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు పంపిణీ చేస్తాం. అవసరమైన పత్రాలతో తమ పరిధిలోని బ్యాంకులను సంప్రదించాలి.

జిల్లాలో 1.45 లక్షల మంది పట్టా పాస్‌పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా, మరో 10 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్‌ సీజన్‌లో 4.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7.5 వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంట రుణాలు సకా లంలో అందించాల్సిన అవసరం ఉంది.