మెట్‌పల్లి మున్సిపల్ టీపీఎస్ రాజేంద్రప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు విధుల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లింబయ్య తొలగింపు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఓ మహిళ.. చర్యలు తీసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్
మెట్‌పల్లి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెట్‌పల్లి మున్సి పల్ టౌన్ ప్లానింగ్ అధికారి రా జేంద్రప్రసాద్‌పై కలెక్టర్ సత్యప్రసాద్ కొరఢా ఝులిపించారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధుల్లో చేరినప్పటి నుంచి అవినీతికి పాల్పడుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా జగ్గుల లావణ్య అనే మహిళ ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలను అందజేసింది. పరిశీలించిన కలెక్టర్ టీపీవోను సస్పెండ్ చేయగా, ఇదే విభాగంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లింబయ్యను విధుల నుంచి తప్పించారు.
నిజామాబాద్ మున్సిపాలిటీలో టీపీఎస్‌గా ఉన్న రాజేంద్రప్రసాద్ మూడేళ్ల క్రితం టీపీఓగా పదోన్నతి పొంది మెట్‌పల్లికి బదిలీపై వచ్చారు. కొంతకాలం పాటు వారంలో మూడు రోజుల చొప్పున రెండు చోట్ల విధులు నిర్వహిస్తూ వచ్చిన ఆయన్ను, పూర్తిగా మెట్‌పల్లికి కేటాయించారు. వచ్చిన ప్రారంభం నుంచే అక్రమాలకు తెరలేపారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నా, లేకపోయినా ఆయనకు ముడుపులు ఇవ్వాల్సిందే. లేకుంటే నిబంధనల పేరుతో నిర్మాణదారులను ముప్పుతిప్పలు పెడుతారనే ప్రచారం ఉంది. పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించాడన్నది బహిరంగ రహస్యం. టీపీఎస్ తీరుతో ఈ మూడేళ్లలో మున్సిపల్‌కు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండి పడగా, అతను మాత్రం లంచాల రూపంలో దండిగా సమకూర్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
అక్రమాలకు పాల్పడుతున్న రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణానికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ తన ఇంటిపైన ఓ అంతస్తు నిర్మాణం కోసం టీపీఎస్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లింబయ్యలు రూ.2లక్షల లంచం తీసుకొని నకిలీ అనుమతి పత్రాలు ఇచ్చారని కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఫోన్ పే ద్వారా వారికి చెల్లించిన నగదుకు సంబంధించిన ఆధారాలను అందజేసింది. పరి శీలించిన కలెక్టర్ ఇద్దరిపై వేటు వేస్తూ ని ర్ణయం తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు మెట్‌పల్లి విడిచి వెళ్లొదన్ని ఆదేశించారు. తీ వ్ర ఆరో పణలు ఎదుర్కొంటున్న రాజేంద్ర ప్రసాద్‌ను బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని చైర్మన్ లింబాద్రి ఇప్పటికే సూచించారు. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉండగానే సస్పెన్షన్‌కు గురి కావడం గమనార్హం.
పట్టణంలోని కళానగర్‌లో ఓ ఉద్యోగి అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడు. స్థానికుల ఫిర్యాదుతో సెట్ బ్యాక్ లేదని ఇబ్బందులకు గురి చేసి అతని నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. వెల్లుల్ల రోడ్‌లో ఓ పాత భవనంపైన అంతస్తు నిర్మాణం చేపట్టారు. అనుమతి లేదని బెదిరింపులకు పాల్పడి రూ.70వేలు తీసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ రోడ్డులో జాతీయ రహాదారి పక్కన స్లాబులతో నిర్మించిన భవనం ఉంది. దానిని వ్యాపార అవసరాల కోసం ఒకరు కొనుగోలు చేసి ఇతర పనులు మొదలుపెట్టగా, అనుమతులు లేవనే సాకుతో రూ.3లక్షల వరకు జేబులో వేసుకున్నట్లు తెలిసింది. లేఔట్ నిబంధనలు పాటించకుండానే పలువురు రియల్ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారిని కూడా బెదిరింపులకు గురిచేసి రూ.లక్షలు వెనకేసుకున్నట్లు సమాచారం.
