Bangladesh: బంగ్లాదేశ్‌లో నిర్మితమవుతున్న అతిపెద్ద ‘‘శ్రీరాముడి విగ్రహం’’ వివాదానికి కేంద్రంగా మారింది. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గైబంధా జిల్లాలో నిర్మిస్తున్న 81 అడుగుల ఎత్తైన విగ్రహం పనుల్ని తీవ్రవాద ఇస్లామిక్ వర్గాలు బెదిరింపుల కారణంగా నిలిపేశారు. ఈ విగ్రహాన్ని నిర్మించవద్దని రాడికల్ ఇస్లామిక్ మూకలు ర్యాలీలు, నిరసనలు చేశాయి. ఈ పరిణామాలు అక్కడి హిందువుల్లో, మైనారిటీల వర్గాల్లో భయాందోళనలు పెరిగాయి. మైనారిటీ మతస్వేచ్ఛ బంగ్లాదేశ్‌లో ప్రశ్నార్థకంగా మారింది.

పలాశ్‌బారి ప్రాంతంలోని శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ సముదాయంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. సమారు 220 మిలియన్ టాకాలు అంటే సుమారుగా రూ. 15.6 కోట్ల వ్యయంతో ఈ శ్రీరాముడి భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహంతో పాటు 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా నిర్మించాల్సి ఉంది. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇస్లామిక్ సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ చెప్పారు.

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడి మారాడు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో జమాతే ఇస్లామి వంటి మతోన్మాద సంస్థలపై నిషేధాన్ని ఎత్తేశాడు. అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరిగింది. శ్రీరాముడి విగ్రహ నిర్మాణంపై ఆ దేశంలోని మతోన్మాద మత బోధకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక మౌలానా మాట్లాడుతూ.. విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చకపోతే, ముస్లింలే దాన్ని ధ్వంసం చేస్తారని హెచ్చరించాడు. ఈ పరిస్థితుల్లో చట్ట వ్యవస్థ, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు తాత్కాలికంగా నిర్మాణాన్ని నిలిపేస్తున్నట్లు ఆలయ కమిటి ప్రకటించింది. తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదని, ఎవరి మత భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని ఆలయ కమిటీ చెబుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల గైబంధాలో జరిగిన ఇస్లామిస్టుల ర్యాలీలో శ్రీరాముడి చిత్రాన్ని అవిత్రం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడు విగ్రహాన్ని అవమానించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు వివక్ష ఎదుర్కొంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు, వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ.. శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయాలన్న పిలుపు తాలిబాన్ తరహా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.