విజయవాడ సీతన్నపేట స్విమ్మింగ్ పూల్ సమీపంలో గురువారం విద్యుత్ షాక్ తగిలి ఒక గోవు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన గోమాతకు ఆయన నివాళులు అర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ప్రమాదానికి విజయవాడ నగర పాలక సంస్థ మరియు విద్యుత్ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపమే కారణమని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రమాదకరంగా వంగిపోయిన ట్రాన్స్‌ఫార్మర్, పాత విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని గతంలోనే పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సీతన్నపేట స్విమ్మింగ్ పూల్ ప్రాంతానికి నిత్యం వందలాది మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు వస్తుంటారని, ఇటువంటి రద్దీ ప్రదేశంలో విద్యుత్ ప్రమాదం జరగడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇది భవిష్యత్తులో జరగబోయే పెద్ద ప్రమాదాలకు హెచ్చరిక అని పేర్కొన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేసి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ప్రజల, చిన్నారుల భద్రతను విస్మరించిన బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి వెంకన్న, పిల్ల దుర్గారావుతో పాటు కృష్ణ గో సంరక్షకులు పాల్గొన్నారు.