అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవినాశ్ నార్నేను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఆయన భార్య రాజిత సబ్బినేని (27) హత్య కేసులో తొమ్మిది నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
గతేడాది ప్రారంభంలో వివాహం జరిగిన ఈ దంపతుల మధ్య అక్టోబర్ చివరలో విషాదం చోటు చేసుకుంది. బాత్రూమ్‌లో తాళం వేసుకున్న భార్య పలకడం లేదని అవినాశ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా గదిలోకి ప్రవేశించగా, రాజిత నేలపై మృతదేహంగా కనిపించింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో గొంతు నులమడం వల్ల ఊపిరాడక మరణించినట్లు తేలింది.
దర్యాప్తులో భాగంగా అవినాశ్ వాదనలు నిజం కావని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో అతను ఇంటి నుంచి వెళ్లినట్లు కనిపించినా, ఆ తర్వాత లోపలికి ఎవరూ రాలేదు. మరోవైపు అవినాశ్ ఫోన్‌లో ఇండియాలోని ప్రియురాలితో సంబంధాలు బయటపడ్డాయి. పెండ్లికి కూడా వచ్చిన ఆమెకు హత్య మరుసటి రోజు మృతదేహం ఫొటోను పంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
హత్యకు ముందు జరిగిన చాటింగ్‌లో రాజిత తాగిన స్మూతీలు చేదుగా ఉన్నాయని, దగ్గు టానిక్ లాగా ఉందని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అవినాశ్ మాత్రం ఆమెకు ఒంట్లో బాగోలేదని, దగ్గు మందు తాగి కుప్పకూలి ఉండవచ్చని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. చివరకు తొమ్మిది నెలల విచారణ అనంతరం హత్య ప్లాన్ చేసిందని నిర్ధారించారు.
జూలై 1న కోర్టు అవినాశ్‌పై అధికారికంగా ఫస్ట్-డిగ్రీ మర్డర్ ఛార్జీలు నమోదు చేసింది. నిందితుడు తాను నిర్దోషినని వాదిస్తుండగా, ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.







