నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బట్టిబెడ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమంలో 12 ఏళ్ల జబా శాంత మృతి చెందింది. 8వ తరగతి చదువుతున్న ఈ బాలిక, హాస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ముందు రోజు రాత్రి ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ బయటకు వెళ్లగా, ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. అదృశ్యమైన జబా శాంత కోసం గాలించగా, ఆమె మృతదేహం లభ్యమైంది.

ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఉమ్మర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని హత్య అని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు సునాబెడా గ్రామ పంచాయతీ దొల్‌దలి గ్రామానికి చెందినది.

మహిళా హక్కుల సంస్థ మా ఘరో కన్వీనర్ కాధంబనీ త్రిపాఠి ఈ ఘటనపై స్పందిస్తూ, బాలిక ఆ చెట్టును ఎక్కడం అసాధ్యమని, ఇది హత్యేనని ఆరోపించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు హరావతి గొండో పాల్గొన్నారు.

ఈ ఘటనపై రాజకీయ నేతలు కూడా స్పందించారు. బీజేడికి చెందిన మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యా మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.