నెల్లూరు జిల్లాకు చెందిన మల్లి దివ్యతేజ (34) మృతదేహం ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం-కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు దివ్యతేజను, ఆయన స్నేహితుడు సాతపాటి శశికాంత్‌ను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శశికాంత్‌ను వదిలేసిన పోలీసులు, దివ్యతేజ పరారీలో ఉన్నారని అప్పట్లో ప్రకటించారు.
దివ్యతేజ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో పిటిషన్ వేసిన గంటలోనే, పోలీసులు దివ్యతేజ మృతదేహం పొలాల్లో ఉందని లాయర్‌కు సమాచారం ఇచ్చారు. తాము కోర్టుకు వెళ్లకపోతే మృతదేహం కూడా దొరికేది కాదని, పోలీసులు దాన్ని మాయం చేసేవారని దివ్యతేజ తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి ఆరోపించారు.
ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, దివ్యతేజను లాకప్‌లోనే పోలీసులు కొట్టి చంపారని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై దెబ్బలు ఉన్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ తెలిపారు. ఈ కేసులో ఎస్సైని సస్పెండ్ చేయాలని, గుంటూరు జిల్లా పోలీసులతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. నైట్ బీట్‌లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, వారిని వెంబడించగా శశికాంత్ పట్టుబడ్డాడని, రెండో వ్యక్తి పారిపోయాడని ఆయన వివరించారు. మృతదేహం దివ్యతేజదిగా గుర్తించామని, ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు.








