బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా జరిపారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాలను చేపట్టాయి.

సిరిసిల్లలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేయడంతో పాటు, పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో అన్నదానాలు చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే నాయకుడిగా ఆయనను కొనియాడారు.

కరీంనగర్ నగరంలో వివిధ డివిజన్ల వారీగా సేవా కార్యక్రమాలు జరిగాయి. రేకుర్తిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఏడాదికి సరిపడా నోటు పుస్తకాలు, స్టేషనరీని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పంపిణీ చేశారు. 32వ డివిజన్ హుస్సేనీపురాలో 150 మంది పిల్లలకు, 33వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కార్పొరేటర్లు అందజేశారు. మారెట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాటసారులకు, వ్యాపారులకు అల్పాహార వితరణ జరిగింది.

రామడుగులో జరిగిన రక్తదాన శిబిరంలో 35 మంది పాల్గొని రక్తాన్ని దానం చేశారు. చొప్పదండి పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ సేవా కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.