ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో వినియోగానికి అందుబాటులో ఉన్న 146.55 టీఎంసీల నీటిలో 115.70 టీఎంసీలు తమకే కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి బోర్డును కోరారు. ఎల్‌ నినో అనే వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం 49 శాతం తక్కువగా నమోదైందని, అందుకే నీటి వినియోగంపై ఆంక్షలు అవసరమని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది.

అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలను కేటాయించాలని ఏపీ డిమాండ్ చేసింది. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, కాలువల ద్వారా నీటిని మళ్లించేందుకు అనుమతులు కోరింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా 6.50 టీఎంసీలు, సాగర్ నుంచి 7.15 టీఎంసీలను మళ్లించుకుందని సమాచారం.

ఈ నెల 17న జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ సమర్పించిన ఈ నీటి వాటా ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ ఇండెంట్‌కు బోర్డు ఆమోదం తెలిపే అవకాశం ఉందని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదని వారు విమర్శిస్తున్నారు.