రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనమహోత్సవం పురోగతిపై మంత్రి సీతక్క ఆదివారం సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి ఆమె జిల్లాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో మొక్కల పంపిణీ, గుంతల తవ్వకం, నాటిన మొక్కల మనుగడ వంటి అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం లక్ష్యంలో 91 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే మొక్కలు నాటడానికి అవసరమైన గుంతల తవ్వకంలో కూడా 92 శాతం పురోగతి సాధించామని తెలిపారు. జిల్లాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, వర్షాలు అనుకూలంగా ఉన్నప్పుడే మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

మొక్కలు నాటడంతోనే బాధ్యత తీరదని, అవి బతికి ఎదగడం ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్కను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నీరు అందించడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో మొక్కల మనుగడను నిరంతరం గమనించాలని ఆమె ఆదేశించారు.

ప్రభుత్వం ఈ ఏడాది 2.75 కోట్ల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తోంది. జామ, ఉసిరి, మామిడి, సీతాఫలం, మునగ వంటి పండ్ల మొక్కలను ప్రతి ఇంటికి చేరవేయడం ద్వారా కుటుంబాలకు తాజా పోషకాహారం అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు. పండ్ల మొక్కల పెంపకం కేవలం పచ్చదనం కోసమే కాకుండా, కుటుంబ ఆరోగ్యానికి చేసే పెట్టుబడి అని ఆమె పేర్కొన్నారు.

వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. పచ్చని రాష్ట్రం కోసం ప్రతి గ్రామంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.