జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చలాకీ చంటి, తన ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తులపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు అహంకారం ఉందని, షూటింగ్‌లో కొన్ని అడుగుతానని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. తనకు సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించి, కెరీర్‌లో జరగాల్సిన కీలక అవకాశాలను అడ్డుకున్నారని చంటి ఆవేదన వ్యక్తం చేశారు.
తన వస్త్రంపై ఒట్టేసి చెబుతున్నానని, తనను ఇబ్బంది పెట్టిన వారంతా సర్వనాశనం అవుతారని ఆయన శపించారు. తాను ఎందుకు వస్త్రం అనే పదం వాడానో ప్రేక్షకుల్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు ఎవరికీ చెప్పని ఈ విషయాన్ని, తనను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తులు సర్వనాశనం అయిపోతారని ఆయన తీవ్ర భావోద్వేగంతో తెలిపారు.
జబర్దస్త్ నుంచి మూడుసార్లు బయటకు వెళ్లడం, మళ్లీ రావడంపై వస్తున్న విమర్శలపైనా చంటి స్పందించారు. షో నుంచి బయటకు వచ్చినంత మాత్రాన నటుల గ్రాఫ్ పడిపోయిందని అనుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీమ్ లీడర్ల అభిప్రాయాల గురించి కూడా ఆయన తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
ఇటీవల గుండెపోటు రావడంతో చంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన చంటి, ప్రస్తుతం తన కెరీర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.








