శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పనితీరు మార్చుకున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఆయన, ఇప్పుడు నియోజకవర్గానికి రావడం తగ్గించడమే కాకుండా, వచ్చినప్పుడు కూడా ప్రజలకు తగిన సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉండటం సహజమే అయినా, సొంత జిల్లాను పూర్తిగా విస్మరించడం సరికాదని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప, ఇతర సమయాల్లో ఆయన శ్రీకాకుళం ముఖం చూడటం లేదని, ఒకవేళ వచ్చినా మెరుపులా వచ్చి వెళ్ళిపోతున్నారని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
ఎంపీని కలవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సెల్ఫీలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, సెల్ఫీలతో సమస్యలు తీరవని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పవని సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం దశాబ్దాలుగా కింజరాపు కుటుంబానికి కంచుకోటగా ఉంది. తండ్రి ఎర్రన్నాయుడి వారసత్వాన్ని కొనసాగిస్తున్న రామ్మోహన్ నాయుడు, స్థానిక అభివృద్ధిలో తన ముద్ర వేస్తారని జిల్లా వాసులు ఆశించారు. అయితే, అభివృద్ధి పనుల్లో వెనుకబడటంతో పాటు, ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
కేంద్ర మంత్రి పదవి శాశ్వతం కాదని, మరో రెండున్నరేళ్లలో మళ్లీ ప్రజల వద్దకే ఓట్ల కోసం రావాల్సి ఉంటుందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ చిన్న విషయాన్ని మంత్రి గమనించడం లేదని, ఆయన తీరులో మార్పు రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.







