ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మణిపూర్‌లో జనగణనను వాయిదా వేయాలని నిర్ణయించారు. మణిపూర్ గవర్నర్, ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

గత కొంతకాలంగా మణిపూర్‌లో ఎన్‌ఆర్‌సీ (NRC) అమలు చేయాలని స్థానిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌సీ అంటే దేశంలో నివసించే పౌరుల వివరాలను నమోదు చేసే జాతీయ పౌర రిజిస్టర్. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే జనాభా గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని మైతేయి, నాగా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, కుకీ-జో కౌన్సిల్ మాత్రం దీనిపై భిన్నమైన వైఖరిని తీసుకుంది.

ఈ నిరసనల నేపథ్యంలో 14 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం ఢిల్లీలో క్యాంపెయిన్ నిర్వహించాయి. కేంద్ర నాయకులు, అధికారులతో వారు జరిపిన సంప్రదింపుల వల్లే జనగణన వాయిదా సాధ్యమైందని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు. ప్రజల గొంతును విన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

మణిపూర్‌లో 2023 నుంచి మైతేయి-కుకీ జాతుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులై వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. రాష్ట్రంలోని ఈ ఉద్రిక్త పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.