భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. స్థానిక సర్పంచ్ గంగావతి నవీన్, ఐశ్వర్య దంపతుల కుమార్తె తన్విత శ్రీ (4) ఆదివారం ఉదయం ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి చిన్నారి సరదాగా ఎక్కింది.

కారులోకి ఎక్కిన వెంటనే డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. దీనివల్ల చిన్నారి బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయింది. కారులో తీవ్రమైన వేడి, గాలి ఆడకపోవడంతో తన్విత శ్రీ స్పృహ కోల్పోయి ముందు సీటు కింద పడిపోయింది.

కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. బంధువులు, ఇరుగుపొరుగు వారి సాయంతో గ్రామంలోని సందులన్నీ వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు ఇంటి ముందున్న కారును పరిశీలించగా, చిన్నారి సీటు కింద అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు.

వెంటనే కారు డోర్లు తెరిచి చిన్నారిని జూలూరుపాడులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

తన్విత శ్రీ ఏనుకూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్న చిన్నారి ఇలా కారులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.