నోయిడా సెక్టార్-75లోని గార్డెనియా గేట్‌వే సొసైటీలో ఉన్న టవర్ C-2, ఫ్లాట్ నంబర్ 1814లో ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న వ్యక్తి దాహం వేసి నీళ్లు తాగడానికి మంచం దిగి వెళ్లిన కొద్ది క్షణాలకే సీలింగ్ స్లాబ్ పెచ్చులై మంచంపై, నేలపై కూలిపోయింది. ఆ సమయంలో వ్యక్తి మంచంపై ఉండి ఉంటే తీవ్ర గాయాలయ్యేవి, లేదా ప్రాణాపాయం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనతో సొసైటీలోని నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఏళ్లుగా ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌లో నిర్మాణ లోపాలు ఉన్నాయని, గోడలకు పగుళ్లు, ప్లాస్టర్ ఊడిపోవడం, బాల్కనీలు దెబ్బతినడం, నీరు ఇంకడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా, బిల్డర్ అసలు లోపాలను సరిదిద్దకుండా కేవలం పైపైన మరమ్మతులు మాత్రమే చేస్తున్నారని నివాసితులు పేర్కొన్నారు.

గురువారం జరిగిన ఈ ప్రమాదం తర్వాత, హౌసింగ్ కాంప్లెక్స్ మొత్తం నిర్మాణ భద్రతను తనిఖీ చేయాలని నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు నోయిడా అథారిటీని, సంబంధిత అధికారులను కోరారు.