సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలోని అబ్బాలో ఈ ప్రమాదం జరిగింది. గని ఒక్కసారిగా కుప్పకూలడంతో లోపల పనిచేస్తున్న 30 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు, సహాయక సిబ్బంది కలిసి శిథిలాలను తొలగించి 30 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా పలువురు కార్మికులు మట్టి దిబ్బల కింద చిక్కుకొని ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.

ప్రమాదం నుంచి బయటపడిన ఫ్లోరియన్ గాగుయెండే అనే కార్మికుడు మాట్లాడుతూ, ఇది ఆధునిక యంత్రాలు లేని సాంప్రదాయ పద్ధతిలో నడిచే గని అని చెప్పారు. లోపల ఉన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక డిప్యూటీ మేయర్ సులేమాన్ బి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సంస్థలు తక్షణమే ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ప్రతినిధి ఇవారిస్తే నగామానా బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్యం, ఇతర సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.

గనుల్లో సరైన భద్రతా పరికరాలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. గనుల విభాగంలో వెంటనే భద్రతా మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.