జులై 24న విడుదల కానున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్లలో భాగంగా కిరణ్ అబ్బవరం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'సంబరాల ఏటిగట్టు' సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమా దర్శకుడు రోహిత్ 2021లో తనను కలిశారని, మొదట రెండు కోట్ల బడ్జెట్‌తో చిన్న కథను సిద్ధం చేశారని కిరణ్ చెప్పారు. ఆ దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో, మంచి కథతో వస్తే చేద్దామని తాను సూచించానని, అలా 'సంబరాల ఏటిగట్టు' కథను రోహిత్ తన వద్దకు తీసుకువచ్చారని తెలిపారు. హనుమాన్ నిర్మాత నిరంజన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశామని, దర్శకుడిని కూడా తానే పరిచయం చేశానని కిరణ్ పేర్కొన్నారు.

అయితే, ప్రీ ప్రొడక్షన్ దశలో తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, సినిమా బడ్జెట్ 60 నుంచి 70 కోట్లకు పెరగడం వంటి కారణాలతో తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని కిరణ్ వివరించారు. తన మార్కెట్ స్థాయికి అంత బడ్జెట్ రిస్క్ అని భావించి, నిర్మాత నిరంజన్‌కు వద్దని చెప్పానని ఆయన తెలిపారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా చేస్తున్నారని తెలిసి తాను సంతోషించానని, దర్శకుడి ప్రతిభ తనకు తెలుసు కాబట్టి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' సినిమాను సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తుండగా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ సుమారు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు.