తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణం కోసం ఏపీ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో '102' తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ వాహనాల రూపురేఖలు, బ్రాండింగ్‌ను ఖరారు చేశారు. ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, మాతా శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. తొలిదశలో 300 వాహనాలను అందుబాటులోకి తెస్తుండగా, త్వరలో మరో 200 వాహనాలను ప్రభుత్వం సమకూర్చనుంది.

ఈ వాహనాల్లో ప్రయాణించే తల్లులు, నవజాత శిశువుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఈబీడీ, ఈఎస్‌పీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. గర్భిణులు సులభంగా ఎక్కేందుకు ప్రత్యేక ఫుట్‌రెస్టులు, హ్యాండ్‌రెయిల్స్‌ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో గర్భిణి కూర్చున్న సీటు వద్దే ఉండే ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే, వెంటనే 102 కాల్‌సెంటర్‌కు సమాచారం అందుతుంది. లైవ్‌ జీపీఎస్‌, నావిక్‌ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా వాహనం ఎక్కడుందో కంట్రోల్‌ సెంటర్‌ పర్యవేక్షిస్తుంది.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులను ఇంటికి చేర్చే ఈ డ్రాప్‌బ్యాక్‌ సేవలు పూర్తిగా ఉచితం. తల్లితో పాటు ఇద్దరు సహాయకులు ప్రయాణించే వీలుంది. అధిక రక్తహీనత, హైరిస్క్ గర్భిణులకు ప్రత్యేక పికప్‌, డ్రాప్‌బ్యాక్‌ సేవలు అందుతాయి. ఈ సేవల నిర్వహణ బాధ్యతలను విద్యవేద ఫౌండేషన్ అండ్ మెసర్స్ శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సార్టియంకు అప్పగించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సేవలకు రూ.37.40 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది.

ఆగస్టు 11న నరసరావుపేటలో జరిగే కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ వాహనాలను ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోనూ అదే రోజున ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణంలో తల్లిపాలు, శిశు సంరక్షణ, టీకాలపై అవగాహన కల్పించేందుకు వాహనాల్లో ప్రత్యేక ఆడియో వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.