అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పళ్ళ బురుసు'. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించగా, ఈ సినిమాను ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ మరిన్ని సినిమాలు నిర్మించనున్నామని తెలిపారు. ఇప్పటికే 'లెనిన్' సినిమాను విడుదల చేశామని, త్వరలో 'రంభ, ఊర్వశి, మేనక'తో పాటు తన 'కింగ్ 100' సినిమా కూడా రాబోతోందని ఆయన వెల్లడించారు.

'పళ్ళ బురుసు' సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ, తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడం అనే అంశం చుట్టూ ఈ కథ సాగుతుందని చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు తాను నవ్వుకోవడంతో పాటు, కళ్లల్లో నీళ్లు కూడా వచ్చాయని, మనసు బరువెక్కిందని తెలిపారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటనతో పాటు పవన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

అన్నపూర్ణ కాలేజీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చినప్పుడు తెలంగాణ సంస్కృతిపై సినిమా తీయాలని సూచించారని, ఆ నేపథ్యానికి తగ్గ కథే 'పళ్ళ బురుసు' అని నాగార్జున చెప్పారు. ఆగస్టు 14న తన తల్లి పుట్టినరోజు కావడంతో, అమ్మానాన్నల ఆశీస్సులు ఈ సినిమాపై ఉంటాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.