నటుడిగా ఎదుగుతున్న క్రమంలో వచ్చే అహం, గర్వాన్ని ఎలా నియంత్రించుకోవాలో రాజమౌళిని చూసి నేర్చుకున్నానని నటుడు ప్రభాస్ శ్రీను తెలిపారు. జీవితంలో స్థాయి పెరిగే కొద్దీ గర్వం రావడం సహజమని, కానీ అటువంటి సమయంలో నేల మీద నిలబడటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
‘విక్రమార్కుడు’ సినిమా షూటింగ్ రోజుల నుంచే రాజమౌళితో తనకు పరిచయం ఉందని ప్రభాస్ శ్రీను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన బైక్‌పై షూటింగ్‌కు వచ్చేవారని, విరామ సమయంలో సెట్‌లోని గడ్డిపైనే విశ్రాంతి తీసుకునేవారని చెప్పారు. ఎలాంటి స్టార్ హంగులు లేకుండా ఆయన చాలా సాధారణంగా ఉండేవారని తెలిపారు.
రాజమౌళి ఇంటి వాతావరణం కూడా ఎంతో సాదాసీదాగా ఉండేదని ఆయన వివరించారు. హీరోలు, టెక్నీషియన్లు, డ్రైవర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసి భోజనం చేసేవారని, ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవని చెప్పారు. ‘ఛత్రపతి’ సినిమా సమయంలో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, రాజమౌళి పని చేసుకుంటుంటే తాము కింద కూర్చొని సరదాగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా, దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని రాజమౌళి జీవనశైలి ద్వారా నేర్చుకున్నానని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఆయనను దగ్గరగా చూస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. రాజమౌళిని తమందరికీ గురువుగా, దేవుడితో సమానమైన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు.







