క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో 'Advance Tip' లేదా 'Choose an Add-on' వంటి ఆప్షన్లను యాప్‌ల నుంచి వెంటనే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. టిప్ ఇస్తే రైడ్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని, డ్రైవర్ త్వరగా వస్తాడని ప్రయాణికులను నమ్మించేలా ఉండే సందేశాలను ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫీచర్లు వినియోగదారులపై అదనపు చెల్లింపుల ఒత్తిడిని పెంచుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
ప్రయాణం ప్రారంభం కాకముందే టిప్ వసూలు చేయడం వినియోగదారుల రక్షణ చట్టం 2019 నిబంధనలకు విరుద్ధమని కేంద్రం పేర్కొంది. టిప్ ఇవ్వడం అనేది పూర్తిగా ప్రయాణికుడి ఇష్టమని, అది కూడా ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ఇచ్చేలా యాప్‌లలో మార్పులు చేయాలని సూచించింది. ఒకవేళ ప్రయాణికుడు టిప్ ఇస్తే, ఆ మొత్తాన్ని అగ్రిగేటర్లు ఎలాంటి కోత లేకుండా నేరుగా డ్రైవర్‌కు అందించాలి.
ఆగస్టు 11న జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, అన్ని మోటార్ వెహికల్ అగ్రిగేటర్లు తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వెంటనే సమీక్షించుకోవాలి. రైడ్ కన్ఫర్మేషన్, డ్రైవర్ కేటాయింపు లేదా సేవ నాణ్యత మెరుగుపడుతుందనే భ్రమ కలిగించే ఏ ఫీచర్‌ను యాప్‌లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.








