ప్రముఖ మసాలా తయారీ సంస్థ ఎవరెస్ట్ ఫుడ్ ప్రాడక్ట్స్, ఇంగువ తయారీ సంస్థ లాల్జీ గోధూ అండ్ కంపెనీలపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించే ఈ సంస్థ, సదరు కంపెనీల ఉత్పత్తుల్లో నాణ్యత లోపించిందని నిర్ధారించింది.
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ముంబైలోని ఎవరెస్ట్ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా, వాటిలో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు గుర్తించారు. దీంతో ఎవరెస్ట్ తయారు చేసే ఇంగువపై నిషేధం విధించడంతో పాటు, చికెన్ మసాలా, గరం మసాలా, ఎగ్ కర్రీ మసాలా ఉత్పత్తులపై నోటీసులు జారీ చేశారు.
ఈ మసాలా ప్యాకెట్లపై ఉప్పు శాతం, మసాలా దినుసుల వివరాలను స్పష్టంగా ప్రకటించలేదని అధికారులు గుర్తించారు. ప్యాకెట్లలో 5 శాతం కంటే ఎక్కువ ఉప్పు ఉన్నా, ఆ విషయాన్ని కంపెనీలు వెల్లడించలేదు. అంతేకాకుండా, మసాలాల్లో అధిక మొత్తంలో స్టార్చ్ (పిండి పదార్థం) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
ఎవరెస్ట్‌తో పాటు లాల్జీ గోధూ అండ్ కంపెనీ ఇంగువ శాంపిల్స్‌లో కూడా నాణ్యత లోపించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కూడా స్టార్చ్ ఎక్కువగా ఉండటంతో, ఆ బ్రాండ్ విక్రయాలను కూడా నిలిపివేయాలని ఆదేశించారు. నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయించడం ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
నిబంధనలు పాటించే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఎవరెస్ట్ కంపెనీని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో లోపాలను సరిదిద్దుకునేందుకు ఒక ప్రణాళికను రూపొందించి సమర్పించాలని FSSAI ఈ కంపెనీలను ఆదేశించింది. నాణ్యత ప్రమాణాలు పాటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







