ఎన్టీవీ నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎప్పుడూ చట్టపరిధిలోనే విధులు నిర్వర్తించానని, కోర్టు ధిక్కరణకు ఎక్కడా తావులేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు.

గడిచిన రెండేళ్లలో హైడ్రా సంస్థ వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడిందని రంగనాథ్ గుర్తుచేశారు. హైడ్రా ఉద్దేశం పేదల ఇళ్లను కూల్చడం కాదని, కేవలం కబ్జాదారుల పీడ విరగడ చేయడమేనని ఆయన వివరించారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల పేదల ఇళ్లను తొలగించాల్సి వస్తే, వారికి ముందుగా ప్రత్యామ్నాయ వసతి కల్పించిన తర్వాతే ఆ ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

మెగా ఫ్యామిలీతో తనకు 15 ఏళ్లుగా పరిచయం ఉందని, అయితే తాను ఎప్పుడూ కులసంఘాల సమావేశాలకు హాజరు కాలేదని రంగనాథ్ తెలిపారు. తన వ్యక్తిగత ఇమేజ్ కంటే ప్రభుత్వ ప్రతిష్టే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హిట్లర్ స్ఫూర్తిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న సందర్భం వేరని, బయట జరుగుతున్న ప్రచారం భిన్నమని ఆయన వివరించారు. ఫాతిమా కాలేజీ చెరువు పరిధిలో లేదని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.