ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 71,536 మంది చేనేత కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అయితే, అర్హత ఉండి కూడా నగదు అందని వారి నుంచి వస్తున్న విజ్ఞప్తులపై మంత్రి సవిత సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం కొత్తగా 13,678 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరికీ వారం రోజుల్లోగా రూ. 25 వేల చొప్పున నగదు జమ చేయాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారిని గుర్తించి అందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను జత చేసి అధికారులకు సమర్పించాలి. అధికారులు పరిశీలన పూర్తి చేసి, అర్హత ఉన్న వారి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.
చేనేత కుటుంబాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఇప్పటికే 85,678 మందికి పింఛన్లు అందుతుండగా, 50 ఏళ్లు నిండిన అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు. అలాగే, 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.







