ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్ లాగ్ బుక్‌ను పరిశీలించిన ఆయన, రైతులకు రోజుకు ఎన్ని గంటల విద్యుత్ ఇస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొన్నటి వరకు 14-15 గంటల విద్యుత్ సరఫరా ఉండగా, ఈ వారం నుంచి కేవలం 12 గంటలే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆపరేటర్ చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ 12 గంటల సరఫరాలో కూడా పదేపదే విద్యుత్ అంతరాయం కలుగుతోందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మహిళలు బిందెలతో రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి నెలకొందని హరీశ్‌రావు విమర్శించారు. మిషన్ భగీరథ వ్యవస్థను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ పేరు వస్తుందనే అక్కసుతోనే నీటి సరఫరాను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో 23,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రెండు యూనిట్లు, భద్రాద్రి ప్లాంట్‌లోని ఒక యూనిట్ మూతపడటం వల్ల 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 4000 మంది రైతులకు ఐదు నెలలుగా బీమా డబ్బులు అందలేదని ఆయన పేర్కొన్నారు. బొమ్మలరామారం మండలంలోనే 10 రైతు బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వ్యవసాయ అధికారి తెలిపారని ఆయన చెప్పారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న బీమా మొత్తాలను చెల్లించాలని, ఆగిపోయిన విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.