ప్రస్తుత డిజిటల్ కాలంలో గంటల తరబడి మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల వైపు చూడటం వల్ల మసక దృష్టి, కంటి అలసట, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని తీసుకోవడం వల్ల కళ్లద్దాల అవసరం పూర్తిగా తొలగిపోతుందనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు.
అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, లిగ్నాన్‌లు కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు కళ్లు పొడిబారే సమస్యను తగ్గిస్తాయి. మరోవైపు, గుమ్మడి గింజలలోని జింక్, మెగ్నీషియం, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు కంటి రెటీనా పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జింక్ వయసు పెరగడం వల్ల వచ్చే దృష్టి లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ గింజలను వేయించుకుని లేదా సలాడ్లు, పెరుగు, స్మూతీలు, ఓట్స్‌లో కలుపుకుని తీసుకోవచ్చు.
ఆహారంతో పాటు కంటి చూపును కాపాడుకోవడానికి మరికొన్ని జాగ్రత్తలు అవసరం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూసే '20-20-20' నియమాన్ని పాటించడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు, సిట్రస్ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి తగినంత నీరు తాగడం, రోజుకు 7-8 గంటల నిద్రపోవడం కళ్లకు విశ్రాంతినిస్తాయి. ఎండలోకి వెళ్లేటప్పుడు యూవీ కిరణాల నుండి రక్షణ ఇచ్చే సన్‌గ్లాసెస్ ధరించడం, సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది. సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని కంటి పరీక్షలే మంచి దృష్టిని కాపాడుకోవడానికి అసలైన మార్గాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.








