గుంటూరు జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకుడు దాడి చేసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అమానుష ఘటనపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ, ప్రభుత్వం మూడు రోజుల పాటు బయటకు రాకుండా దాచిపెట్టిందని జగన్ ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు హడావుడి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పుడే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని, స్టేషన్లలో పంచాయితీలు చేయడం ఏ రకమైన పోలీసింగ్ అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడుస్తోందని జగన్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చి, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతల అరాచకాల వల్ల రాష్ట్రం 'జంగిల్ రాజ్'గా మారిందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతలు ఏం చేసినా పోలీసులు రక్షిస్తారనే ధైర్యం గ్రామ స్థాయి వరకు పాకిందని జగన్ విమర్శించారు. మహిళల భద్రతపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల ఆగ్రహమే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని జగన్ హెచ్చరించారు.