వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పర్యటించారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పొగాకు యార్డుకు వెళ్లారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కేజీ పొగాకు ధర 289 రూపాయలు ఉండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అది 236 రూపాయలకు పడిపోయిందని జగన్ పేర్కొన్నారు. వేలం కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం పొగాకును రిజెక్ట్ చేస్తున్నారని, దళారులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేజీ పొగాకుపై 70 రూపాయల వరకు నష్టపోతున్నామని రైతులు జగన్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేశారని, రైతు భరోసాలో కోతలు పెట్టారని జగన్ విమర్శించారు. 27 ఏళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు కరువయ్యాయని, రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.