జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, వారి అంకితభావాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న నేతన్నలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల జీవితాలు చిద్రమవుతున్నాయని, తెలంగాణ కోసం పోరాడిన వారు నేడు తమ బతుకుదెరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలు చేనేత రంగానికి ఊపిరి పోశాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ హామీలను విస్మరించి పథకాలను నిలిపివేయడంతో మగ్గాలు మూగబోతున్నాయని, వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని, నేతన్నలకు భరోసా కల్పించాలని హరీశ్‌రావు కోరారు. జాతికి వస్త్రాలను అందించే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేస్తూ, నేతన్నను కాపాడుకుందాం, చేనేతను బతికించుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు.








