పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ వ్యవహారశైలిపై అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ వారు కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు.
45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్ సమస్యలపై కమిషనర్ అరుణశ్రీకి వినతిపత్రం ఇచ్చారు. అయితే, సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యం గురించి వివరణ కోరగా, తనతో మాట్లాడేదేమీ లేదని చెబుతూ అటెండర్ ద్వారా కమిషనర్ బయటికి పంపించారని సతీష్ ఆరోపించారు.
ఈ ఘటనపై నిరసన తెలుపుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే సొంత ప్రభుత్వంపై నిరసన చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నిరసనలో బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలైన బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు తెలపడం గమనార్హం.
కమిషనర్ అరుణశ్రీ వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు వేచి చూడాలి.



