రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సవరణ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు. నీట్ పరీక్ష లీకేజీ ఘటనల తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఆయన నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ బిల్లులో శిక్షలను పెంచడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వంటి అంశాలు సరైన దిశలో ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు. అయితే, కేవలం శిక్షలు పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని, 2024లో ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన 101 ప్రతిపాదనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన సూచించారు. పరీక్షలు జరగకముందే లీకేజీలను అడ్డుకునేందుకు సైబర్ సెక్యూరిటీ ఆడిట్, ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ట్రాన్స్‌మిషన్, బయోమెట్రిక్ యాక్సెస్ వంటి ఆధునిక సాంకేతికతను తప్పనిసరి చేయాలని కోరారు.

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా కఠిన చర్యలు ఉండాలని, పరిపాలనా బాధ్యతను స్పష్టం చేయాలని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు. నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టంలో పేర్కొన్న గడువులోగా దర్యాప్తు, విచారణ పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన మౌలిక వసతులు, నిపుణులను కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యా రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందని, ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నారని ఎంపీ గుర్తు చేశారు. పరీక్షల ఫలితాల్లో జాప్యం లేకుండా, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. పరీక్షలు రద్దయినప్పుడు విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం, కౌన్సెలింగ్ అందించాలని సూచిస్తూ, నిజాయితీగా చదివే ఏ ఒక్క విద్యార్థి వ్యవస్థ వైఫల్యానికి బలి కాకూడదని ఎంపీ వద్దిరాజు ముగించారు.