నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఆందోళన చేపట్టారు.
ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ నాయకులు తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి, అక్కడే బైఠాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా, రెండు పార్టీల వారు ఎదురెదురుగా కూర్చుని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల నాయకులను సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.








