తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్, తన భార్య పద్మిని, కుమారుడు వెంకటేశ్వర్, కుమార్తె నిత్యశ్రీతో కలిసి శనివారం ఉదయం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకారు. శ్రీనివాస్ స్థానికంగా బడ్డీకొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు పాలిటెక్నిక్ చదువుతుండగా, కుమార్తె 9వ తరగతి చదువుతోంది.
ఈ ఘటనలో నదిలోకి దూకిన పద్మినిని స్థానిక జాలర్లు రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, శ్రీనివాస్‌తో పాటు వెంకటేశ్వర్, నిత్యశ్రీ నదిలో గల్లంతయ్యారు.
కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆ కారణంతోనే వారు ఆత్మహత్యకు యత్నించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గడిచిన వారం రోజుల్లో చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకడం ఇది రెండోసారి. గత వారం కూడా ఒక కుటుంబం ఇదే విధంగా నదిలోకి దూకగా, మత్స్యకారులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.






