భారతదేశంలో పనిచేసే కార్మికులలో 24 శాతం మంది ప్రతి వారం 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఎటువంటి వేతనం పొందకుండానే పని చేస్తున్నారు. మరో 40 శాతం మంది కార్మికులు వారానికి ఆరు నుంచి 15 గంటల పాటు వేతనం లేని అదనపు పనిభారాన్ని మోస్తున్నారని ADP సంస్థ తన నివేదికలో పేర్కొంది.

దీంతో దేశంలోని శ్రామికశక్తిలో చాలా మంది తాము చేసే పనిని వేతనం వచ్చే పనిగా కాకుండా, యాజమాన్యాల కోసం ఉచితంగా శ్రమను వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి భారత్ అంత తీవ్రంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా 62 శాతం మంది కార్మికులు వారానికి ఐదు గంటలు, 26 శాతం మంది ఆరు నుంచి 15 గంటలు, కేవలం 12 శాతం మంది మాత్రమే 16 గంటలకు పైగా వేతనం లేని పనిని చేస్తున్నారు.

అయితే, కార్మికులతో ఎక్కువ సమయం పనిచేయించినంత మాత్రాన ఉత్పత్తి పెరుగుతుందని భావించడం సరికాదని నివేదిక స్పష్టం చేసింది. వేతనం లేని పనిభారం ఎక్కువగా ఉన్న కార్మికులు తమ సామర్థ్యానికి తగిన స్థాయిలో పని చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది.

అంతేకాదు, ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఉద్యోగాన్ని వదిలేయాలనే ఆలోచన వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.