సైబరాబాద్ పరిధిలోని మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్రమంగా క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పురం ప్రాంతాలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కలిసి ఈ ఉమ్మడి దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మొత్తం 10 క్లినిక్‌లపై పోలీసులు దాడులు చేసి, అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో ఎవరికీ ఎంబీబీఎస్ (MBBS) వంటి వైద్య విద్యార్హతలు లేవు. వీరు కేవలం ఇంటర్మీడియట్, పదో తరగతి, బీకాం, బీఎస్సీ, బీఫార్మసీ చదువుకుని వైద్యులుగా చెలామణి అవుతున్నారు. జగద్గిరిగుట్టకు చెందిన వి. బుచయ్య, మేడ్చల్‌కు చెందిన ఎం. సుధాకర్ చారి, డి. అంజా గౌడ్, దేవరాయంజాల్‌కు చెందిన రామావత్ ప్రకాష్, సూరారానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, బాచుపల్లికి చెందిన కె. నారాయణ, కొనపాల బుచ్చిబాబు, ఆర్‌సీ పురం బండ్లగూడకు చెందిన జి. ప్రహ్లాద్, పటాన్ చెరువుకు చెందిన ఎస్. శ్రీనివాసరావు, పి. గంగారాంలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నకిలీ క్లినిక్‌ల నుంచి 9 స్టెతస్కోపులు, 9 బీపీ మెషీన్లు, 6 థర్మామీటర్లు, పల్స్ ఆక్సీమీటర్, వెయింగ్ మెషీన్, షుగర్ మెషీన్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, సిరంజీలు, ఎక్స్‌పైర్ అయిన మందులు, సెలైన్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు చిన్న పిల్లలకు కూడా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. క్లినిక్‌లలో బెడ్లు వేసి, రోగులను అడ్మిట్ చేసుకుని, అర్హత లేకుండానే సెలైన్ ఎక్కిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ ఘటనపై కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి మాట్లాడుతూ, నకిలీ వైద్యం వల్ల తప్పుడు నిర్ధారణలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు వైద్యులను సంప్రదించే ముందు వారి అర్హత, రిజిస్ట్రేషన్ పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు. తమ పరిసరాల్లో ఇలాంటి నకిలీ క్లినిక్‌లు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఈ ఆపరేషన్ సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు, ఎస్‌ఓటీ డీసీపీ పి. శోభన్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. నిందితులపై మేడ్చల్, పటాన్ చెరువు, జగద్గిరిగుట్ట, పెట్ బషీరాబాద్, సూరారం, బాచుపల్లి, ఆర్‌సీ పురం, ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.








