కొండా సురేఖ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయంలో ఆమెను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, అది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం, చేర్చుకోవడం వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పార్టీ జాతీయ నాయకత్వానికి మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బందులు పడుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం 30 శాతం కమీషన్లతో నడుస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఆరోపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు, అంతర్గత తగాదాల వల్లే నేతలపై వేటు పడుతోందని రాంచందర్ రావు విశ్లేషించారు. మహిళా సాధికారత, పితృస్వామ్య భావజాల నిర్మూలన గురించి రాహుల్ గాంధీ చేసే ప్రసంగాలకు, కాంగ్రెస్ పార్టీ ఆచరణకు ఏమాత్రం పొంతన లేదని ఆయన మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం మహిళా మంత్రులు కూడా లేరని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరిని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. మహిళలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీరు ప్రజల ముందు బయటపడిందని ఆయన పేర్కొన్నారు.