హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు మరియు దేవాదాయ శాఖల మధ్య సమన్వయం కోసం ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా పనిచేస్తుంది.

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంపై మంత్రి సురేఖ హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా సురక్షితమైన, సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నందున, పుష్కరాల ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని మంత్రి సూచించారు. పాత ఘాట్లను పటిష్టం చేయడంతో పాటు, భవిష్యత్తులో కూడా ఉపయోగపడేలా కొత్త ఘాట్లను నాణ్యతతో నిర్మించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఏర్పాట్లు ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు పుష్కరాల సమగ్ర ప్రణాళికను మంత్రికి వివరించారు. ఇప్పటికే టైర్-1, టైర్-2 పరిధిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఘాట్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మొత్తంగా ఐదు కిలోమీటర్లకు పైగా ఘాట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ (R&B), పంచాయతీ రాజ్ శాఖలకు నిధులు విడుదలయ్యాయని అధికారులు వెల్లడించారు.

వైద్య, పోలీసు, పర్యాటక శాఖలకు కూడా నిధులు మంజూరయ్యాయని, దశలవారీగా టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. పుష్కరాల కోసం చేపట్టే ప్రతి నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన ఉండాలని, తాత్కాలిక ఏర్పాట్లుగా భావించవద్దని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు పాల్గొన్నారు.