తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను బండి సంజయ్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి పాఠశాలలు, కాలేజీలు లేవని ఇప్పుడు చెబుతున్న కెటిఆర్, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఆయన నిలదీశారు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, పేపర్ లీకులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబం నుంచే బిఆర్‌ఎస్ పాలనకు రిపోర్ట్ కార్డు వస్తోందని, వారి సొంత పిల్లలే విద్యా వ్యవస్థ బాగోలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టడం కంటే, సొంత పిల్లలు చెబుతున్న విషయాలను వినాలని ఆయన కెటిఆర్‌కు సూచించారు. భారత్ కంటే ఇతర దేశాలే గొప్పవని మాట్లాడటం సరికాదని, ఇది రావణాసురుడి మనస్తత్వమని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు తన దేశభక్తిని ప్రశ్నించడంపై బండి సంజయ్ స్పందిస్తూ, చివరి శ్వాస వరకు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తానని స్పష్టం చేశారు. తనకు దేశభక్తి అనేది జీవితాంతం నమ్మిన సిద్ధాంతమని, ఏదైనా దక్కనప్పుడు దానిని తక్కువ చేసి మాట్లాడే 'సోర్ గ్రేప్స్' ధోరణిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.