గత ఆర్థిక సంవత్సరానికి గాను చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఒ) వార్షిక వడ్డీని జమ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం ఖాతాల్లో ఈ మొత్తం చేరినట్లు సంస్థ వెల్లడించింది. మిగిలిన ఖాతాల్లో కూడా జులై 15 నాటికి వడ్డీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

మీ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవాలంటే మీ యునివర్శల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) యాక్టివేట్‌లో ఉండాలి. ఈపీఎఫ్‌ఒ మెంబర్ పోర్టల్, ఉమాంగ్ యాప్ లేదా ఎస్‌ఎంఎస్ సర్వీస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు. పోర్టల్‌లో లాగిన్ అయి 'view pass book' ఎంచుకుంటే లావాదేవీల వరుసల్లో వడ్డీ మొత్తం కనిపిస్తుంది.

ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్ నంబరును అనుసంధానించి, పీఎఫ్ బ్యాలెన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే చివరి మూడు నెలల లావాదేవీలు కనిపిస్తాయి. అందులో వడ్డీ వివరాలు చూడవచ్చు, పూర్తి వివరాల కోసం పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 7738299899కు 'epfoho uan <UAN> tel' అని మెసేజ్ పంపితే తెలుగులో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

ప్రస్తుతం వడ్డీ జమ ప్రక్రియ కొనసాగుతున్నందున కొందరికి పాస్‌బుక్‌లో మొత్తం వెంటనే కన్పించకపోవచ్చు. దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదని, కొన్ని రోజులు ఎదురుచూస్తే ఖచ్చితంగా ఖాతాలో వడ్డీ జమ అవుతుందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.