సామాజిక సంస్కరణల చరిత్రలో నిలిచిన జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి పోరాటాల నేపథ్యంలో 'ఫూలే' సినిమాను రూపొందించారు. కుల వివక్ష, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా విద్య, సమానత్వం కోసం వారు చేసిన కృషిని ఈ చిత్రంలో చూపించారు.
ఈ సినిమాను అనంత్ మహదేవన్ దర్శకత్వంలో సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ పొన్నం రవిచంద్ర నిర్మించారు. మొదట మరాఠీ భాషలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా చూశారు. ఫూలే దంపతులు మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలన కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తి అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను చూపే చారిత్రాత్మక కథనమని చిత్ర బృందం తెలిపింది. సమానత్వం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ సినిమాను ప్రతి విద్యార్థి, యువత థియేటర్లలో చూడాలని వారు కోరారు.





