ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఇంటి తలుపులు పగలగొట్టి, ఆమెను కిందకు దించి ప్రాణాలతో కాపాడారు. సకాలంలో అప్రమత్తం కావడంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి గత నెల 22న నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఫిర్యాదు చేసినా పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకపోవడంపై మాధురి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు అతడిని కేసు నుండి తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం అందడం లేదన్న మనస్తాపంతోనే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

ఈ వివాదానికి సంబంధించి ఈశ్వర్ సాయి తప్పు తన వైపు లేదని వీడియోలు విడుదల చేయగా, మాధురి రాథోడ్ మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. ఈశ్వర్ సాయి తన భార్య శరణ్యతో కలిసి మాధురిని ఒకే గదిలో పట్టుకున్నట్లు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈశ్వర్ సాయిని వెంటనే అరెస్ట్ చేసి తనకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని మాధురి రాథోడ్ వర్గాలు కోరుతున్నాయి. బాసింగ బలాలు వంటి జానపద పాటలతో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయిపై నమోదైన కేసులో తదుపరి చర్యలు ఏంటనేది వేచి చూడాలి.