యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 1, 2, 9వ వార్డుల నివాస ప్రాంతాల పక్కనే ఉన్న బృందావన్ కాలువ దుస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు, డ్రైనేజీ మురుగు పేరుకుపోవడంతో ఈ కాలువ చెత్తకుప్పగా మారింది.

గత కొన్నేళ్లుగా కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడం, వర్షాకాలంలో కూడా వరద నీరు ప్రవహించకపోవడంతో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ కాలువ నుంచి వచ్చే దోమలు ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాలువ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, దోమల కాటుతో ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలువలోని వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బ్లీచింగ్ చల్లడంతో పాటు దోమల నివారణ మందును పిచికారీ చేసి, తమ ఆరోగ్యాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.