మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో, మెదక్ రూరల్ పరిధిలోని మంబోజిపల్లిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ఏటీఎంలను కత్తిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఏటీఎంల వద్ద భద్రతా లోపాలు ఉండటం వల్లే దొంగలు సులభంగా దోపిడీకి పాల్పడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. బ్యాంకులు ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారం వంటి భద్రతా పరికరాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉండేవారని, ప్రస్తుతం ఎక్కడా వారిని నియమించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఏటీఎంల వద్ద అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే బ్యాంకు అధికారులు, భద్రతా సంస్థలు, పోలీసులకు సమాచారం అందేలా అలారం వ్యవస్థ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఈ దోపిడీలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ దొంగతనాలకు అంతరాష్ట్ర దొంగల ముఠా కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఏటీఎంల వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండటంతో దొంగలు సులభంగా తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు గమనించారు. టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం ఏటీఎం కేంద్రాల వద్ద ఆధారాలను సేకరించింది. నిందితులు నగదుతో ఎటువైపు పారిపోయారనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బ్యాంకు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఏటీఎంల వద్ద భద్రతను పెంచేందుకు బ్యాంకు అధికారులతో మాట్లాడతామని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో బీట్ కానిస్టేబుళ్ల ద్వారా తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతామని వారు పేర్కొన్నారు.








