సైబర్ నేరాలను నియంత్రించేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాల నిరోధక బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం, సైబర్ నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుతో పాటు, నేరాల వల్ల ఇతరుల మరణానికి కారణమైతే మరణశిక్ష విధిస్తామని పార్లమెంట్ స్పీకర్ ఆంగ్ లిన్ డ్వే వెల్లడించారు.

సైబర్ నేరగాళ్లు బాధితులను నిర్బంధించడం లేదా హింసించడం వంటి చర్యలకు పాల్పడితే ఈ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు. ఉద్యోగాల పేరుతో విదేశీ విద్యార్థులను మయన్మార్‌కు రప్పించి, వారిని బెదిరించి సైబర్ నేరాల్లోకి దించుతున్నట్లు తమకు అనేక ఫిర్యాదులు అందాయని ఆంగ్ లిన్ డ్వే పేర్కొన్నారు.

ఇటీవల సోషల్ మీడియా ప్రకటనలు నమ్మి సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లిన సుమారు 100 మంది తెలుగు విద్యార్థులు మయన్మార్‌లోని సైబర్ ముఠాల వలలో చిక్కుకున్నారు. ఈ ముఠా విద్యార్థుల పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని వారిని నిర్బంధించింది. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు గుర్తించిన బాధితులు, తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై జూలై 17న బాధితుల కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మయన్మార్‌లో చిక్కుకున్న ఆ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.