హైదరాబాద్ గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడలో ఈ ఘటన జరిగింది. 20 ఏళ్ల శ్రేయ స్థానిక వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి తన ఇంట్లో శ్రేయ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఘటనా స్థలంలో పోలీసులు శ్రేయ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి కాలేజీ ఫ్యాకల్టీ, తోటి విద్యార్థులే కారణమని ఆమె అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల సమయంలో ఒక లెక్చరర్ అందరి ముందు తనను అవమానించారని, తోటి విద్యార్థులు కూడా వేధించడంతో శ్రేయ తీవ్ర మనస్తాపానికి గురైందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.