ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎల్‌బినగర్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ అధికారులు సోమవారం రట్టు చేశారు. ఎల్‌బినగర్ పరిధిలో ఆరు కిలోల గంజాయిని విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా.

ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతా నాగ్ (30), ఆమె సహచరుడు పొజ్జా దిర్డో, నాగర్‌కర్నూల్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన మంచాల రాజేశ్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన పోజ్జా దిర్డో గతంలో కూడా గంజాయి రవాణా కేసులో పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన సరఫరాదారులుగా ఉన్న లక్షన్, సత్యనారాయణ అలియాస్ సత్య, మల్లేశ్, శివశంకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

మల్కన్‌గిరి జిల్లాకు చెందిన లక్షన్ గంజాయి సాగుదారుల నుంచి సరుకును సేకరించి హైదరాబాద్‌లోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సుమారు రెండేళ్ల క్రితం సునీతా నాగ్‌ను ఈ దందాలోకి చేర్చుకున్న లక్షన్, మొదట ఆమె ద్వారా సత్యకు సరుకును చేరవేసేవాడు. ఆ తర్వాత సునీతా స్వయంగా లక్షన్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరకు విక్రయిస్తూ సొంత వ్యాపారాన్ని నడుపుతోంది.

ప్రస్తుతం ఈ కేసులో ఆరుగురు వినియోగదారులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అలాగే గంజాయి సరఫరా గొలుసులో ఉన్న మరికొంతమందిని గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని అధికారులు పేర్కొన్నారు.